- సీఎంకు 400 మంది మేధావుల బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎల్-నినో ప్రభావంతో తీవ్ర కరువు ఉన్న కారణంగా డిసెంబర్లో నిర్వహించాలనుకున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’ను వాయిదా వేయాలని 400 మందికి పైగా పౌర సమాజ నేతలు, మేధావుల పేరిట సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలను ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని, రాబోయే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఊరూరా ప్రజలు, పశువులు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతుంటే 4 వేల మందికి పైగా వచ్చే విదేశీ ప్రతినిధులకు ప్రజాధనంతో ఫైవ్ స్టార్ లో విలాసాలు, విందులు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నీటి ఎద్దడి కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాల్సి వచ్చిందని, ప్రభుత్వ హాస్టళ్లలో తాగునీరు లేక పిల్లలను ఇండ్లకు పంపిస్తున్నారని, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఆలోచనలు చేస్తున్నారని గుర్తుచేశారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులకోసారి మంచినీరు సరఫరా అవుతున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ సదస్సుల ఆర్భాటం సరికాదన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, మాజీ కేంద్ర కార్యదర్శి ఈఏఎస్ శర్మతో పాటు దేశ, రాష్ట్ర స్థాయి పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఈ లేఖపై సంతకాలు చేశారు.
ఈ కరువును మీరే కరోనాతో పోల్చారు..
గత అక్టోబర్ 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్‌ను మేధావులు తమ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్-నినో తీవ్రతను సీఎం కరోనాతో పోల్చారని, 2027 జూలై వరకు తాగునీటి ఎద్దడి కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ వరి సాగు వద్దని రైతులకు విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. ప్రజాధనం, నీరు, విద్యుత్‌ను పూర్తిగా కరువు నివారణ పనులకు, ఉపాధి హామీ కూలీలకు, మూగజీవాల దాణాకు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులకే వినియోగించాలని కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఆడంబరాలకు పోవద్దని, తక్షణమే ఇన్వెస్ట్ తెలంగాణ సమిట్‌ను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
